ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: విప్ విజయరమణారావు

ఓదెల, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి స్థానిక నాయకులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆలయం చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన నిర్మాణాలు పూర్తిగా వాస్తు ప్రకారంగా సాగాలని సూచించారు.

నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని విప్ విజయరమణారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.