ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల పట్టణంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక శివాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు బెలిదె నర్మద ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ‘సుచరిత షాపింగ్’ వారి సౌజన్యంతో లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన ఐదుగురు మహిళలకు చీరలను బహుమతిగా అందజేశారు. పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వాసా విద్యాసాగర్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా సాగింది.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సాక్షాత్తూ ఆదిపరాశక్తి స్వరూపమని కొనియాడారు. “ధర్మాన్ని నిలబెట్టేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు మరియు దుష్టశిక్షణ కోసం అమ్మవారు ఈ కలియుగంలో జన్మించారు. వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత మూర్తి ఆమె,” అని ఆమె పేర్కొన్నారు.
