చేనేత రంగాన్ని తక్షణమే ఆదుకోవాలి

చేనేత రంగాన్ని తక్షణమే ఆదుకోవాలి

  • ఎమ్మెల్సీ ఎల్. రమణ డిమాండ్‌

చౌటుప్పల్ , ఆంధ్రప్రభ: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనాధారమైన చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎల్. రమణ విమర్శించారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన ‘ఉమ్మడి నల్లగొండ జిల్లా చేనేత హక్కుల సాధన సభ’లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

“రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో చేనేత కార్మికులు ఉన్నారు” అని ఎమ్మెల్సీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో లక్షలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయని, గత ప్రభుత్వంలో అమలు చేసిన థ్రిఫ్ట్ పథకాన్ని, నూలుపై 25 శాతం సబ్సిడీని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టెస్కో కొనుగోలు విధానాన్ని పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీలు, రాహుల్ గాంధీ ఇచ్చిన జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. పద్మశాలి కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.100 కోట్లలో నయాపైసా ఖర్చు చేయలేదని విమర్శించారు.

రుణమాఫీ, యార్న్ సబ్సిడీ పథకాల్లో అనేక షరతులు విధిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కోటి మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.

చేనేత నాయకులు రాజకీయంగా ఎదగాలని, రాజ్యాధికారం దిశగా పయనించాలని ఎమ్మెల్సీ రమణ పిలుపునిచ్చారు. అధికారులు, ప్రభుత్వం తమ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, పాలక మండళ్లు లేకపోవడం వల్ల కీలక నిర్ణయాల్లో చేనేత కార్మికుల పాత్ర లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, చేనేత నాయకులు ఎర్రమాధ వెంకన్న, కర్నాటి వెంకటేశం, చిక్కా నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply