ప్రతిభకు పట్టాభిషేకం

ప్రతిభకు పట్టాభిషేకం
-విద్యార్థినికి సైకిల్ బహుకరించిన ఖమ్మం డీఈవో
ఖమ్మం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) చైతన్య జైనీ తన ఉదారతను చాటుకున్నారు. స్థానిక సంభాని నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని అర్చన చూపిన ప్రతిభకు మెచ్చి, ఆమెకు సైకిల్‌ను బహుమతిగా అందజేశారు.
ఇటీవల డీఈవో చైతన్య జైనీ సంభాని నగర్ పాఠశాలను సందర్శించినప్పుడు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో అర్చన ఏమాత్రం తడుముకోకుండా, వేగంగా సమాధానాలు చెప్పడంతో డీఈవో మంత్రముగ్ధులయ్యారు. చిన్నారి తెలివితేటలకు ముగ్ధులైన ఆయన, “నీకు ఏం కావాలో కోరుకో.. బహుమతిగా ఇస్తాను” అని అప్పట్లోనే హామీ ఇచ్చారు.
హామీని నెరవేర్చిన వైనం..
పాప కోరిక మేరకు సైకిల్ కావాలని ఉపాధ్యాయులు డీఈవోకు సమాచారం అందించారు. దీనికి స్పందించిన చైతన్య జైనీ, తన సొంత నిధుల నుండి రూ. 6,500లను ఉపాధ్యాయులకు పంపించారు. ఆ మొత్తంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరీ, ఉపాధ్యాయులు సూర్యకుమారి, పర్వీన్, మీనా కలిసి సైకిల్‌ను కొనుగోలు చేసి అర్చనకు అందజేశారు.
బహుమతిగా సైకిల్ అందడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా, సామాన్య విద్యార్థిని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన డీఈవో చైతన్య జైనీపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
