తొలి దశ తెలంగాణ ఉద్యమ ఉధృతి మరువలేనిది

తొలి దశ తెలంగాణ ఉద్యమ ఉధృతి మరువలేనిది

ఆలేరు, ఆంధ్రప్రభ : 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రజల కీలక భాగస్వామ్యంతో ఉదృతంగా కొనసాగిందని అప్పటి ఆ ఉద్యమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు సింగిల్ విండో మాజీ చైర్మన్, సీనియర్ నేత సముద్రాల కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆలేరు ప్రాంతం నుండి ఉద్యమకారుడిగా పాల్గొన్న తన అనుభవాలను వివరించారు. అప్పటి ఉద్యమంలో తమ గ్రామమైన శారాజిపేటలో బస్సును ఉద్యమకారులు దగ్ధం చేశారని 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనను ఆయన గుర్తు చేశారు.

1969 జూలై 29న తనతో పాటు గ్రామానికి చెందిన వారిని అరెస్టు చేశారని, ఆగస్టు 4న రిమాండ్ చేసి, అదే నెల 14న విడుదల చేశారని, తమని నల్లగొండ జైలులో ఉంచారని చెబుతూ అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను వివరించారు. 1969 ఉద్యమం నీరుగారి పోయాక జరిగిన మలిదశ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని అంటూ ఈ విజయంలో ప్రజలతో పాటు మలిదశ ఉద్యమకారుల కీలక భాగస్వామ్యం ఉందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్ద కాలంలో మలిదశ ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఉద్యమకారులకు తగిన విధంగా న్యాయం చేయాలని ఆయన సూచించారు.