August2Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
మనిషి కంటే ఏఐకే ఎక్కువ టైమ్!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే** అన్నాడో సినీకవి. భార్యాభర్తల బంధాలే ప్రశ్నార్థకమైపోయినప్పుడు, ఇక ఈ రోజుల్లో మిగతా బంధాల గురించి ఏమని చెప్పగలం? మరి స్నేహబంధమూ ఆర్థికమేనా? అని అడిగితే ఒక్కమాటలో సమాధానం చెప్పడం కష్టం. మీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని అడిగితే సోషల్ మీడియాలోని సంఖ్య ఠక్కున చెప్పగలం. కానీ అవసరానికి ఆదుకునే ఫ్రెండ్స్ ఎంతమందని అడిగితే…? సమాధానం చెప్పడానికి కాస్త సమయం తీసుకోవాల్సి వస్తుంది.
అంటే మన అవసరానికి ఆదుకోని వాళ్లందరూ మన ఫ్రెండ్స్ కాదా? మరి మనం కూడా ఎంతమంది అవసరాలకు వెళ్లి ఆదుకుంటున్నాం? మరి మనమూ ఎవరికీ నిజమైన ఫ్రెండ్స్ కాదా? నిజానికి, అవసరానికీ స్నేహానికీ పోలిక పెట్టుకున్నప్పుడే స్నేహం ప్రశ్నార్థకమవుతుంది. స్నేహం అనేది లాభనష్టాల లెక్క కాదు. బేరసారాల బంధం కాదు. ఎవరు ఎంత చేశారనే ఖాతా పుస్తకం కాదు. అలాంటి లెక్కలు మొదలయ్యాక స్నేహం కంటే వ్యాపారమే ఎక్కువ కనిపిస్తుంది. ఆర్థికంగా ఆకాశానికీ, భూమికీ తేడా ఉన్న స్నేహితుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం. ఒకరేమో వందల మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉంటారు. మరొకరేమో మరో పూట గడిస్తే చాలని బతుకుతుంటారు. అయినా వాళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం చెక్కుచెదరదు. ఒకరు చేయి చాపారా? ఇంకొకరు సాయం చేశారా? ఎంత చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలు వాళ్లిద్దరి మధ్యే ఉంటాయి. అక్కడ బయటివాళ్లకు తీర్పు చెప్పే హక్కు ఉండదు.
ఎందుకంటే నిజమైన స్నేహంలో సాయం కూడా ప్రచారం కోసం ఉండదు. అయితే, ఇప్పుడు పరిస్థితి ఇంకోలా మారుతోంది. డబ్బు, హోదా, అవసరాల సంగతి పక్కన పెడితే… మన మాట పూర్తిగా వినే స్నేహితుడే కరువవుతున్నాడని చాలామంది వాపోతున్నారు. ప్రతి ఒక్కరికీ సమయం తగ్గిపోయింది. వినడానికి ఓపిక తగ్గిపోయింది. ఎదురుగా కూర్చొని మాట్లాడటం తగ్గిపోయింది. “చెప్పు రా… నేను వింటున్నా” అనే మాట కూడా ఇప్పుడు విలాసంగా మారుతోంది. అందుకే ఇప్పుడు చాలామంది ఒక్కరితోనే స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. అదే… ఏఐ ఎందుకంటే అది ఎప్పుడూ మన మాట మధ్యలో ఆపదు. “ఇప్పుడు బిజీగా ఉన్నా” అనదు. “తర్వాత మాట్లాడదాం” అని తప్పించుకోదు. మనం ఒకే ప్రశ్నను పదిసార్లు అడిగినా చిరాకు పడదు. ఎంత తిట్టినా అలగదు. ఎంత పొగిడినా పొంగిపోదు. మనకు కావాల్సినంతసేపు మాట్లాడుతుంది.
కాకపోతే… దానికి ఒకటే లోటు. మన భుజంపై చేయి వేసి ఓదార్చే వెచ్చదనం ఉండదు. నవ్వు కనిపించదు. కన్నీరు కనిపించదు. ఆప్యాయంగా “రా” అని పిలిచే గొంతు ఉండదు. అందుకే ఒక సందేహం కలుగుతోంది. రాబోయే తరాలకు నిజమైన స్నేహితుడు అంటే… ఏఐ మాత్రమే అయిపోతుందా? లేక మనుషులే మళ్లీ మనుషులను వెతుక్కుంటారా? సాంకేతికత ఎంత పెరిగినా, మనిషి మనసు మాత్రం ఇప్పటికీ మరో మనిషి కోసం వెతుకుతూనే ఉంది.
మొబైల్‌లో వేలాది కాంటాక్టులు ఉండొచ్చు. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ కష్టంలో “ఏమైంది రా?” అని అడిగే ఒక్క మనిషి విలువను ఇప్పటికీ ఏ టెక్నాలజీ భర్తీ చేయలేకపోయింది. బహుశా… స్నేహానికి అసలు శత్రువు ఆర్థిక అసమానతలు కాకపోవచ్చు. సమయం లేకపోవడమే, మనసు లేకపోవడమే కావచ్చు. అదే ఆలోచించాల్సిన విషయం.
-మాధవ్, కార్టూనిస్ట్.
++++++++++++++++++++++++

ఒత్తిడిలో మాట జాగ్రత్త
మనలో చాలా మంది మామూలు పరిస్థితుల్లో ఒకలాగా , తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఈ బయట నుండి వచ్చే వత్తిడి మనల్ని కుదురుగా ఉండనివ్వదు. మన వ్యక్తిత్వాన్ని కూడా తాత్కాలికంగా మార్చేస్తూ ఉంటుంది. మామూలుగా చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తులు ఈ ఒత్తిడికి గురి అయినప్పుడు పిచ్చి కోపంతో , అనవసరంగా అరుస్తూ ఉంటారు. ఇది వాళ్ళ తప్పు కాదు, ఆ పరిస్థితుల తప్పు. అయినప్పటికీ అంత అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి అది ఆ వ్యక్తి తప్పే అని అంటారు.
అపార్థం చేసుకుంటారు. లేని పోని అపోహలకు వెళ్తారు.
నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఇలాగే ప్రవర్తించాడు ఒకసారి. ఏదో నేను సరదాగా అన్న మాటకి బాగా కోపం తెచ్చుకుని ‘ నువ్వు ఎవడివి నన్ను అనడానికి ‘ అన్నంత రేంజ్ లో ఎగిరాడు నా మీద. నేను బాగా హర్ట్ అయ్యాను. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు , ‘ ఈ మధ్య అతనికి బోలెడన్ని డబ్బులు రావడం కారణమా లేక స్థాయి పెరిగి కళ్ళు నెత్తికి ఎక్కాయా ‘ అని అనుకున్నాను. కానీ తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందట ..అతను ఆ ఒత్తిడి లో ఉండి అలా మాట్లాడాడు అట. సరే అనుకుని లైట్ తీసుకున్నా నేను .కానీ అప్పటికే అతనిపై నాకు అపార్థం కలిగింది కదా. అందుకే మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా కంట్రోల్ లో ఉండాలి.పిచ్చి కోపంతో మాట జారితే బంధాలు పాడవుతాయి. అంతే కదా ఫ్రెండ్స్ !!!!

అవధులు దాటిన చైతన్యం
“కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, పేర్లకీ పకీర్లకే, పుకార్లకీ నిబద్దులు, తాతగారి బామ్మగారి భావాలకు వారసులు! నడిమి తరగతికి చెందిన అవగునాల కుక్కలు, మొద్దురాతి చిప్పలు, నూతి లోని కప్పలు!..” అన్నాడు మహాకవి.
నేటి తరంలో, అంటే జెన్ జీ లో కొందరు(చాలా తక్కువ మంది, అందరూ కాదు) అది తప్పు అని నిరూపిస్తున్నారు.
కానీ ఇప్పటికీ మెజార్టీ విద్యార్థులు సంకుచితంగానే ఆలోచిస్తున్నారు. Narrow minded గానే ఉన్నారు. కులం, మతం, ప్రాంతం, ఇంటిపేరు ఈ గీతలు దాటి ఆలోచించడం లేదు. కొందరు మా కుటుంబం చాలా గొప్పది అంటారు.
నీకు సమకూరిన వనరులు, అనుకూలించిన పరిస్థితులు వల్ల నీలోని ప్రతిభ సానబెట్ట పడుతుంది. ఎక్కువ సార్లు ఇదే నిజం. అలాగే తల్లి గర్భం, ఆ తొమ్మిది నెలలు కాలం, అప్పటి తల్లి ఆరోగ్యం, తిండి, శాంతి ప్రభావం చూపుతాయి. Heredity intellectuality ద్వారా Miracles అనేది ఐదు శాతం కన్నా తక్కువ.
We are the God chosen people అని విర్రవీగే మధ్య ప్రాచ్యంలో ఒక ప్రాంతం వారు వారిలో కొందరు తెలివైన వారు పుట్టి ఉంటే దానికి కారణం కూడా వారు చుట్టూ ప్రోత్సహించే వాతావరణం ఉండడం, ధనవంతులు కావడం, గొప్ప విద్యా వ్యవస్థ….ఉత్సాహ పరిచే చుట్టూ ఉన్న ఎన్నో…అవి ఎక్కువ కారణం, వారు సాధించిన విజయాలకు. ఈ వ్యక్తీకరణలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మేథావి వర్గం ఈ భూమిపై అన్ని చోట్ల, అన్ని జాతుల్లో పుట్టారు. ప్రకృతి ఆ వివక్ష చూపలేదు! సంకుచితంగా ఆలోచించే మానవ జాతిలో కొందరు అలా ఏడ్చారు!
“ఎంత కోయిల పాట వృథ అయ్యనో కదా చిక్కు చీకటి వన సీమల యందు…” అన్నాడు కదా మహాకవి జాషువా!
సహజ ప్రతిభను సానబెట్టే ఇంటి వాతావరణం, స్కూలు, తల్లితండ్రులు, టీచర్స్, తోటి స్నేహితులు అందరూ కారణం అవుతారు.
Sharpen the saw అంటాడు Stephen R Covey. తన Seven Habits లో. నిరంతర సాధన అవసరం.
సుమారు ఐదు వందల సంవత్సరాల మహమ్మదీయుల పాలన, అరాచకం, దోపిడీ, హింస, హిందూమతం ఆచరించే ప్రజలను హీనంగా చూడడం…ఇదంతా చరిత్రలో నిజాలు. తర్వాత డచ్ అండ్ బ్రిటీష్ పాలన. మన దేశం నలిగిపోయింది. నిజమే అప్పుడు 560 పైగా సంస్థానాలు, పోనీ రాజ్యాలుగా ఉంది నిజమే, కానీ ఇది అఖండ భారతం, అంతర్గతంగా రహస్యంగా ప్రజలు అంతా ఒక దేశం, ఒక జాతి అనే భావం మెజారిటీ ప్రజల్లో ఉంది. కేవలం టెక్నికల్ గా చూసి, అప్పుడు కూడా ఒక దేశం కాదు అనే వాదన తప్పు. అది వితండ వాదం. హైందవ ధర్మం అఖండ భారతంలో ఎక్కువ శాతం ఉంది. రామాయణ, భారతాలు, భగవద్గీత ఉచ్చ్వాస నిశ్వాస గా సాగిన జాతి మనది. పరమత సహనం పాటించారు. ఎందరినో అతిధులుగా ఆహ్వానించి అన్నం పెట్టి అతిథి దేవో భవ అని దణ్ణం పెట్టాము. ఎందరో తిన్నంటి వాసాలు లెక్క పెట్టారు. దేశాన్ని మోసం చేశారు. కలియుగం.
జగద్గురువులు ఆది శంకరాచార్యులు, అంతకు ముందు బుద్ధుడు, తర్వాత రామానుజుల వారు, శ్రీ మధ్వాచార్యులు…, బసవేశ్వరులు…, కొందరిని దైవం నడిపించింది(పంపించింది అని ఎక్కువ మంది నమ్మకం). తర్వాత మన గురజాడ, కందుకూరి, శ్రీశ్రీ…. వచ్చారు.
స్వాతంత్రం గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, జలియన్ వాలాభాగ్, ఉప్పు సత్యాగ్రహం…జరిగిన చరిత్ర మనకు తెలుసు.
స్వయం పరిపాలన, కాశ్మీరు సమస్య, అంతర్గతంగా కులాలు, మతాలు, పేదరికం అలాగే ఉన్నాయి. తెల్ల దోపిడే పోయి, నల్ల దోపిడీ మొదలయ్యింది. అధికారంలో దూరితే చాలు, దొరికితే చాలు, ఒక్కో పార్టీ, ఒక్కో కుటుంబం మాఫియా చీకటి సామ్రాజ్యాలు నిర్మించుకోవడం మొదలు పెట్టాయి. అనంతమైన డబ్బుతో ఒక ప్రాంతాన్ని శాసించడం మొదలు పెట్టారు. డబ్బు, అధికారం ఉన్నవాడు బల్లి అంటే బల్లి, పిల్లి అంటే పిల్లి అలా తానా తందానా బ్యాచ్ లు వచ్చారు. మందు, మద్యం, డ్రగ్స్ ఎలాగూ ఉన్నాయి.
80 ఏళ్ల మన స్వాతంత్రం ఇంకా ఆపసోపాలు పడుతోంది. కొన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి జరిగింది. నిజం. కానీ ఎన్నో రంగాల్లో ఎంతో వెనుక పడ్డాం. సామాజిక నైతికత విషయంలో ఎంతో వెనుక పడ్డాం. అహంకారం, అధికారం…, సామాన్యులు అణకువతో ఉండాలి అని హుకుం జారీ చెయ్యడం సామాన్యం అయిపోయింది. Freedom is always the freedom of dissenters. అనే మాట మర్చిపోయారు.
చూద్దాం, అడవి సద్దు మణిగింది, ఇక ప్రకృతి విధ్వంసం మొదలు పెడదాం అని భావించే కొందరు రాబందులు రెక్కలు విరిచే చైతన్యం నేటి విద్యార్థి లోకంలో ఉంది, ఉండాలి అని నమ్ముదాం! అటువంటి విద్యా వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఒకప్పటి మన గురుకుల విద్యా విధానం ఒక అద్భుతం.
కొంతమంది యువకులు ముందు యుగం దూతలు! పావన, నవజీవన బృందావన నిర్మాతలు! గతకాలపు మితవాదపు గారడీలు నమ్మరు. స్వార్థానికి లొంగిపోయి ఆశయాలు అమ్మరు! వారికి మా ఆహ్వానం! మహాకవి ఎప్పుడో రాశాడు!
అభ్యుదయానికి స్వాగతం చెబుదాం! సత్యమేవ జయతే!

స్వామి తొలి అడుగు పెట్టిన చోటు శ్రీవారి పాదాలు
కలియుగారంభంలో తిరుమలేశుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ పై తొలి అడుగు పెట్టిన స్థలమే శ్రీవారి పాదాలు గా ప్రసిద్ధి చెందాయి . తిరుమల క్షేత్రం లోని ఏడు కొండల్లో ఎత్తైన నారాయణ గిరి పై తరతరాలుగా పూజలందుకుంటున్న స్వామి పాదముద్రలు దర్శనీయ పుణ్య స్థలంగా పేరొందాయి.
అలిగి వైకుంఠం వీడిన మహాలక్ష్మి కోసం భూలోకం చేరుకున్న శ్రీ మహావిష్ణువు తన తొలి అడుగు వరాహ క్షేత్రంలో ఎత్తైన పర్వత శ్రేణి అయిన నారాయణ గిరి పర్వతంపై పెట్టారని కూడా పురాణాలు తెలియచేస్తున్నాయి. తిరుమల క్షేత్ర అభివృద్ధి క్రమంలో ఆ పర్వతం పై ఉన్న పాదాల ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా టీ టీ డి తీర్చిదిద్దింది. ఎత్తయిన ప్రదేశంలోని శ్రీవారి పాదాల చుట్టూ ఒక మండపాన్ని నిర్మించి భక్తులు ఎక్కడానికి వీలుగా 300 మెట్లమార్గం ఏర్పాటు చేసింది. పదేళ్ళక్రితం భక్తుల అత్యుత్సాహంతో కొట్టిన కొబ్బరి కాయల కారణంగా పాదాలలోని ఒక వేలుపై చీలిక ఏర్పడింది. వెంటనే స్పందించిన టీ టీ డి అధికారులు ఆగమోక్తంగా ఆ పాదాలను రాతి పొరతో కప్పి చుట్టూ కంచె నిర్మించారు. కొబ్బరి కాయలు కొట్టడానికి వేరుగా ఏర్పాటు చేసారు.
ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు దర్శించుకునే ఏర్పాటు ఉంది. .
ఎత్తయిన నారాయణగిరి పై వీచే పెనుగాలుల వల్ల ఇబ్బంది కలగకుండా చూడాలని వాయుదేవుని ప్రార్ధిస్తూ ఏడాదిలో ఒకరోజు ఛత్ర చామర ఉత్సవం పేరుతో ఒక కార్యక్రమం జరుగుతుంది.
తిరుమలేశుని ఆలయం వద్ద నుంచి అభిషేక, పూజాద్రవ్యాలతో ఒక గొడుగును అర్చకులు ఊరేగింపుగా శ్రీవారి పాదాల వద్దకు తీసుకు వెళ్తారు. అక్కడ ఆగమోక్తంగా పూజలు సమర్పణలు చేసి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. తిరుమలేశుని ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి పాదాల కొండ వద్దకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉంది.
ఓం నమో వేంకటేశాయ

