మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ అందక లబ్ధిదారుడి ఆవేదన

వికారాబాద్, ఆంధ్రప్రభ : మోమిన్‌పేట్ మండలం కోల్కొండ గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు నిధులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు తన మొబైల్ ఫోన్‌కు నిధులు మంజూరైనట్లు సందేశం వచ్చినప్పటికీ, సంబంధిత అధికారులు చెక్కు అందించలేదని ఆయన పేర్కొన్నారు. దాదాపు రూ. 9 లక్షల వరకు వైద్య ఖర్చులు చేయాల్సి వచ్చిన నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంపై సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తనకు మంజూరైన నిధులను తక్షణమే అందజేసి న్యాయం చేయాలని రాఘవేందర్ రెడ్డి కోరారు.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, కోల్కొండ గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ యాదవ్ స్పందిస్తూ, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను లబ్ధిదారునికి అందించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. లబ్ధిదారునికి న్యాయం జరిగే వరకు తమ వంతు కృషి చేస్తామని, వెంటనే చెక్కు అందించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply