విజయవాడ మెట్రోకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభం
- అధ్యయనానికి అధికారుల సమన్వయ సమావేశం
- నాలుగు విజయవాడ మండలాలు, రెండు కృష్ణా జిల్లా మండలాల్లో ఎస్‌ఐఏ నిర్వహణ
- గ్రామ సభలు, వార్డు సభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ..
- భూ యజమానులు చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం విజయవాడ సెంట్రల్, ఈస్ట్, నార్త్, రూరల్ మండలాల్లో భూసేకరణ చేపట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సామాజిక ప్రభావ మదింపు అధ్యయన నిర్వహణపై శుక్రవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన ఎస్‌ఐఏ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో పాల్గొనే భూసేకరణ అధికారులు, తహశీల్దారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమావేశానికి హాజరయ్యారు.
ప్రభుత్వం నియమించిన ఎస్‌ఐఏ ప్రాజెక్టు ఇన్‌చార్జి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీమతి బి. ఉదయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌ఐఏ అధ్యయన విధానం, కార్యాచరణ ప్రణాళిక, సిబ్బంది నియామకం, ఫీల్డ్ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని నాలుగు రెవెన్యూ మండలాలు, కృష్ణా జిల్లాలోని రెండు మండలాల్లో అధ్యయనాన్ని నిర్దేశిత గడువులో పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్), విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు అధికారులు, సంబంధిత తహశీల్దారులు, ఇతర శాఖల అధికారులు, కృష్ణా జిల్లా అధికారులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు.
భూసేకరణకు సంబంధించిన గ్రామ సభలు, వార్డు స్థాయి సమావేశాలు నిర్ణీత ప్రదేశాల్లో నిర్వహించబడతాయని, వాటి తేదీలు ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. భూ యజమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ సమావేశాలకు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సామాజిక ప్రభావ మదింపు నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
