పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..
- కండ్లకోయ ఫారెస్ట్ లో మొక్కలు నాటిన
- ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.
- ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
- మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు అధికారులు..
మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాలుష్యాన్ని తగ్గించడంలో అందరూ భాగస్వాములు కావాలని మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ ఫారెస్ట్‌లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం రోజు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలను నాటాలి, వాటిని సంరక్షించాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోగలం, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలం. మనం నేడు నాటే ప్రతి మొక్క, రేపటి తరాల ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతగానో భరోసానిస్తుంది.అని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన పర్యావరణ సంరక్షణ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, అటవీ శాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

