5states | కేబినెట్ విస్తరణకు ఇంకాస్త టైమ్
5states | కేబినెట్ విస్తరణకు ఇంకాస్త టైమ్
రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఉండేనా?
అమాత్య రేసులో ఉన్నదెవరు?
నిజామాబాద్‌కు పదవి దక్కేనా
హైకమాండ్‌కు చేని లిస్టు
ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వతే చర్యలు
మంత్రిపదవి కోసం నెలకొన్న పోటీ
శాఖల ప్రక్షాళన ఉంటుందని చర్చ
పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున గుసగుసలు
5states | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మంత్రివర్గం నుంచి కొందరిని తొలగించే అవకాశం ఉండగా.. కొత్త వారికి కేబినెట్‌లో అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా కేరళలో యూడీఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) కూటమికి మెజార్టీ వస్తే అక్కడ సీఎం పదవి తేల్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణపై ఫోకస్ చేయనుందని తెలుస్తోంది.

5states | పార్టీకి డ్యామేజ్ కాకుండా..
ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో మరో ఇద్దరు నేతల్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వీలుంది. ఇందులో ఒక స్థానాన్ని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే చాన్స్ ఉండటంతో రేసులో బాలూనాయక్, రామచంద్రునాయక్ వంటి నాయకులు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి పదవి తమనే వరిస్తుందని వీరు దీమాగా ఉన్నారు. అయితే.. రామచంద్రునాయక్‌ను గత ఏడాది డిప్యూటీ స్పీకర్ పోస్టుకు ఖరారు చేసినప్పటికీ శాసనసభలో ఇంకా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇక.. మరో మంత్రి పదవి బెర్త్ కోసం పలువురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకే అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సీనియర్ నేతలు, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించే వారి పేర్లను కూడా అధిష్టానం పరిశీలించనున్నట్టు సమాచారం. కొందరు మంత్రుల వ్యవహారశైలిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నందున పార్టీకి డ్యామేజ్ జరగకూడదని వారిని మార్చాలని రేవంత్ సూచించే అవకాశాలున్నాయి.
5states | నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ కేబినెట్‌లో ప్రాతినిథ్యం లేదు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క వంటి ప్రముఖులు ఉన్నారు. నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనను మంత్రిగా తీసుకుంటారా లేక ఇదే జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన మహేశ్‌కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. రేవంత్ మాత్రం మహేష్ గౌడ్‌ను పార్టీ పరంగానే ప్రయోజనం కోసం పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధించాలంటే మహేష్ గౌడ్ లాంటి నేత పార్టీ సారథిగా ఉండాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
5states | రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా?
మంత్రి పదవి కోసం చాలా మంది రేసులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వినిపించే పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే తనకు కచ్చితంగా అవకాశం లభిస్తుందని నమ్ముతున్నారు. అయితే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండటం రాజగోపాల్‌కు మైనస్ అవుతోంది. కుటుంబం నుంచి ఒకే మంత్రి పదవి ఇవ్వాలని, రెండు పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ అభ్యంతరం తెలుపుతోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి ఒప్పించడం అంత ఈజీ కాదని వినిపిస్తోంది. వీరితో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ, ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.
5states | శాఖల ప్రక్షాళన ఉండేనా..
మంత్రివర్గ విస్తరణతో పాటు కొన్ని కీలక శాఖల్లో మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అదనపు బారంగా మారిన కీలకమైన హోం శాఖ బాధ్యతను ఒక సీనియర్ మంత్రికి అప్పగిస్తారని పార్టీలోనూ వినిపిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఉన్నప్పటికీ.. టెన్త్, ఇంటర్ ఫలితాలు ప్రభుత్వ సలహాదారు కేశవరావు విడుదల చేసిన విషయం తెలిసిందే. కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కనుక కేబినెట్ విస్తరణకు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
CLICK HERE TO READ MORE : 11Districts Iదీదీ హ్యాట్రిక్ స్కోరు చేస్తారా? కమలం వికసిస్తుందా?
