వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాటం

వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాటం

రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు
సింగారంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రైతు సంఘం నాయకులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్. దేశ్యనాయక్ పిలుపునిచ్చారు. అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా దేశ్యనాయక్ మాట్లాడుతూ, ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. జూన్ 20న జరిగే బహిరంగ సభకు మాజీ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఏ. విజయరాఘవన్, బి. వెంకట్ తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

జూన్ 21, 22 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు.

కనీస వేతనాల అమలు, రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కీలక డిమాండ్లను మహాసభల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మహాసభలు కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు, సీపీఎం గ్రామ కార్యదర్శి బక్కయ్య, పెద్ద ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు కె. శ్రీను, సీఐటీయూ నాయకులు బి. రాములు, ఎస్. వెంకటయ్య, బుచ్చయ్య, రవి, శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు, గోపాల్, చందు తదితరులు పాల్గొన్నారు.