గరిడేపల్లి, పోనుగోడు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని మండల విద్యాధికారి (ఎంఈఓ) పానుగోతు ఛత్రు నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోనుగోడు జడ్పీ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు.

నాణ్యమైన బోధనతోనే గుర్తింపు:
FLN (తొలిమెట్టు), LIP కార్యక్రమాల భాగంగా విద్యార్థులకు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేలా బోధన చేయాలని ఎంఈఓ సూచించారు. గరిడేపల్లి పాఠశాలలో రూపొందించిన ప్రోగ్రామ్ కార్డులను మండలంలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

నిక్కచ్చిగా జనగణన నిర్వహించాలి:
పోనుగోడు పాఠశాలలో తహశీల్దార్ ఎన్. స్రవంతి ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత జనగణన–2027’ శిక్షణా కార్యక్రమానికి ఎంఈఓ హాజరయ్యారు. హౌస్‌లిస్టింగ్ ప్రక్రియపై రెండో బ్యాచ్ సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధి ప్రణాళికలు జనగణనపై ఆధారపడి ఉంటాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరాలు సేకరించాలని తహశీల్దార్ సూచించారు.

మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈఓ ప్రత్యేక నిఘా పెట్టారు. వంట ఏజెన్సీలు మెనూ ప్రకారం రుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ గోపి, ట్రైనర్లు జి. దయాకర్, ఆర్. రవీందర్, ప్రధానోపాధ్యాయురాలు వై. నర్సకుమారి, ఉపాధ్యాయులు జె. సాయిలు, నాగరాజు, శోభారాణి, సునీల రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply