ఘనంగా గ్రామ దేవతల వార్షికోత్సవ నిర్వహణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట పట్టణం లోని గ్రామ బొడ్రాయి మరియు శ్రీ పోచమ్మ అమ్మవార్ల ప్రతిష్ఠా వార్షికోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఉదయం వేళల నుంచే ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఉదయం 5 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, శ్రీ పోచమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేషార్చనలు, సర్వతోభద్రమండల అర్చన, అష్టోత్తర శతకలశ స్థాపన ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఉదయం 7 గంటల నుండి గ్రామస్థులందరూ పూర్ణకలశాలతో శోభాయాత్రగా ఆలయం నుండి గ్రామ బొడ్రాయి (నాభిశిల) వరకు సాగి, విశేష అభిషేకాలు, అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. గ్రామస్తులు తమ గృహాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలంతో బొడ్రాయికి అభిషేకం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పూర్ణకుంభ దర్శనం, మంగళహారతి నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రధాన దిక్పాలక మాతృదేవత హోమములతో చండీ హోమం నిర్వహించగా, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సాయంత్రం 4 గంటలకు బోనాల సమర్పణ, 6 గంటలకు మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన భక్తి భావాలను రేకెత్తించింది. రాత్రి 8 గంటలకు శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించగా, గ్రామస్తుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంగళహారతి, తీర్థప్రసాదం, అన్నప్రసాద వితరణ జరిగింది.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులతో పాటు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు, యాగంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం దేవతల ఆశీస్సులు కోరారు. వార్షికోత్సవ యాగ కార్యక్రమాలు ఆచార్య కాండూరు లక్ష్మణస్వామి నేతృత్వంలో, బ్రహ్మశ్రీ కీ.శే. మూలమళ్ళ రామమూర్తి శర్మ గారి కుమారుల చేత నిర్వహించబడ్డాయి. గ్రామస్థులందరూ ఏకమై పాల్గొనడంతో ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముగిశాయి.
