జాతీయ రహదారి పనుల పరిశీలన..
ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 20వ వార్డు కౌన్సిలర్ ఎండీ హన్ను చొరవతో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ వెంకటేశ్వర నాయక్, స్థానిక కౌన్సిలర్లు పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్ను మాట్లాడుతూ, జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల రాకపోకలు సాఫీగా సాగేందుకు గ్రంథాలయం పక్క నుంచి ఫారెస్ట్ కార్యాలయం మీదుగా తంగడపల్లి రోడ్డుకు అనుసంధానంగా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌ను కోరారు.
ఈ ప్రతిపాదనపై స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించి, ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, కొయ్యడ శేఖర్ గౌడ్, ఆలే శ్రీలత చిరంజీవి, బుడ్డా సురేష్, దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, ఉదరి యాదయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, గడ్డం ఇందిరా రాజారత్నం, పాక చిరంజీవితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
