సోలార్ ఫెన్సింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్

సోలార్ ఫెన్సింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్

కడెం, ఆంధ్రప్రభ : కడం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రత, పాఠశాల పరిసరాల రక్షణ దృష్ట్యా చేపడుతున్న సోలార్ ఫెన్సింగ్ పనులను సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న స్వయంగా పరిశీలించారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుని, సంబంధిత సిబ్బందికి పనులను నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో చాలా కాలంగా కోతుల బెడద తీవ్రంగా ఉందన్నారు.

కోతులు తరచూ పాఠశాల ఆవరణలోకి వచ్చి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ఆహార పదార్థాలు, పండ్లు, మొక్కలు నాశనం చేస్తున్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఎన్నో మార్గాల్లో కోతులను తరిమివేయడానికి ప్రయత్నించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు.

ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్లి, పాఠశాల విద్యార్థుల భద్రత కోసం శాశ్వత పరిష్కారంగా సోలార్ కంచె ఏర్పాటు చేయాలని విన్నవించామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయించారని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారని, ముఖ్యంగా విద్యార్థుల సంక్షేమం కోసం చూపుతున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు పూర్తయిన తర్వాత కోతుల బెడద తగ్గి, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శాంత, ఉపసర్పంచ్ లక్ష్మి ఆనంద్, ఎఫ్‌ఏ కమలాకర్, కారోబార్ మహేందర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply