చిలుపూర్ ఆలయంలో అలరించిన శ్రీకృష్ణ రాయబారం
చిలుపూర్ ఆలయంలో అలరించిన శ్రీకృష్ణ రాయబారం
చిలుపూర్, ఆంధ్రప్రభ:
పౌరాణిక కథలను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో చిలుపూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీకృష్ణ రాయబారం పద్యనాటక ప్రదర్శన నిర్వహించారు.నెల్లుట్ల ఫౌండేషన్ కళాపీఠం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తిరుపతి వెంకటకవుల సాహిత్య సంపదను నేటి తరానికి చేరువ చేసే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు.
నాటకంలోని పద్యాలు, నటీనటుల అభినయం, సంగీతం ప్రేక్షకులను అలరించాయి. ధర్మం, నీతి, సంస్కృతి విలువలను గుర్తుచేసేలా ఈ ప్రదర్శన సాగింది.
తెలుగు పద్యనాటక కళారూపాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి నెల్లుట్ల ఫౌండేషన్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెల్లుట్ల రవీందర్ రావు, చిలుపూర్ ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావును ప్రత్యేకంగా అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతకు తెలుగు సాహిత్య వారసత్వం పరిచయం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కళా కార్యక్రమాలను నిర్వహించి తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థాన పాలకవర్గ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
