ఎస్‌బీఐ బాధితులకు న్యాయం చేయాలి

ఎస్‌బీఐ బాధితులకు న్యాయం చేయాలి

చెన్నూర్, ఆంధ్రప్రభ:
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మోసానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బ్యాంక్ ముందు రెండు రోజులుగా బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఎస్‌బీఐ బ్రాంచ్ బంగారం కుంభకోణంలో రికవరీ చేసిన బంగారాన్ని అసలైన వినియోగదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సుమారు 400 మంది బాధితులు తమ తాకట్టు పెట్టిన బంగారాన్ని తక్షణం ఇవ్వాలని కోరుతూ రెండు రోజులుగా ఎస్‌బీఐ బ్రాంచ్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నా, బ్యాంక్ అధికారులు స్పందించకపోవడం సరికాదని అన్నారు.

కుటుంబ అవసరాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు నేడు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం బ్యాంకు నుంచి తరలిపోతుంటే, బ్యాంకు అధికారుల నిఘా వ్యవస్థ, ఆడిటింగ్ వ్యవస్థ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

వినియోగదారుల భద్రత కంటే బ్యాంక్ అధికారులు తమ ఉద్యోగాలను రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. లోన్ చెల్లించిన వారికి సుమారు 20 శాతం కోత విధించి బంగారం విలువ చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

లోన్ చెల్లించిన బాధితులకు 100 శాతం ప్రస్తుత బంగారం విలువను లేదా వారు తాకట్టు పెట్టిన ఆభరణాలను తక్షణమే అప్పగించాలని వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో చిన్న స్థాయి ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకుని బ్యాంక్ అధికారులు చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. ఈ మొత్తం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.