ప్రజావాణి అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి
ఉట్నూర్, ఆంధ్రప్రభ:
ప్రజావాణి కార్యక్రమంలో గిరిజనులు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి గిరిజనులు వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. పలు సమస్యలను పీవో దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని పీవో స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి గిరిజనులు ఎన్నో ఆశలతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారని, వాటి పరిష్కారంలో జాప్యం చేయరాదని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజావాణికి వచ్చిన గిరిజనులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గిరిజనులతో పాటు మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్, ఏవో దామోదర స్వామి, జీసీసీ డీఎం గుడిమల్ల సందీప్ కుమార్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఐటీడీఏ ఈఈ తానాజీ జాదవ్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమెత మనోహర్, వివిధ శాఖల అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.
