SIR |తిరుపతి జిల్లాలో మొత్తం 14,81,603 మంది ఓటర్లు

  • పురుషులను మించిపోయిన మహిళల ఓట్లు
  • పురుషులు 7,20,329 మంది
  • మహిళలు 7,61,188 మంది ఓటర్లు
  • ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణలో తిరుపతి జిల్లా ముందంజ
  • పారదర్శకంగా లోపరహిత ఓటరు జాబితా తయారీ
  • ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
  • రాజకీయ పార్టీల సహకారంతో ఎస్‌ఐఆర్ విజయవంతం
  • జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటేశ్వర్

తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ కలెక్టరేట్ వేదికగా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాయిదా ఓటరు జాబితా వివరాలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ, అనామలీల పరిశీలన తదితర అంశాలను ఆయన పాత్రికేయులకు వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్‌వో నరసింహులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రారంభం నుంచే ప్రతి దశను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందు తిరుపతి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,429గా ఉండగా, ఇంటింటి ధృవీకరణ అనంతరం ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ధృవీకరణలో భాగంగా గైర్హాజరైనవారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, మరణించినవారు, డూప్లికేట్ నమోదులు కలిపి మొత్తం 2,87,826 కేసులను ప్రత్యేక జాబితాగా గుర్తించినట్లు వెల్లడించారు.

తిరుపతి, చంద్రగిరిలో అధికం..

ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన ఓటర్ల సంఖ్య 14,81,603 గా ఉందని తెలిపారు. వీరిలో 1,62,230 మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, అయినప్పటికీ వారి పేర్లను ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 1 నుంచి 30 వరకు సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, ఎన్నికల సంఘం నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైన పత్రాలు సమర్పించిన అర్హుల పేర్లు తుది ఓటరు జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. మ్యాపింగ్ పూర్తికాని కేసులు ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతిలో 96,280, చంద్రగిరిలో 50 వేలకుపైగా కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యాపింగ్ పూర్తయిన కేసుల్లో కూడా సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించిన అనామలీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

అందుబాటులో జాబితా

వయస్సు వ్యత్యాసాలు, కుటుంబ సంబంధాల నమోదు లోపాలు, ఇతర సాంకేతిక అసంగతల కారణంగా 2,38,863 కేసులు అనామలీలుగా గుర్తించబడినట్లు వెల్లడించారు. రాష్ట్ర సగటు అనామలీ శాతం 18 శాతం కాగా, తిరుపతి జిల్లాలో అది 13 శాతం మాత్రమేనన్నారు. ఈ కేసులకు కూడా నోటీసులు జారీ చేసి, అవసరమైన పత్రాల ఆధారంగా సవరణలు చేపడతామన్నారు. గైర్హాజరు, షిఫ్టెడ్, మరణాలు, డూప్లికేట్ కేసుల వివరాలను వెల్లడిస్తూ తిరుపతి నియోజకవర్గంలో 90,882, చంద్రగిరిలో 50,273, వెంకటగిరిలో 36,497, శ్రీకాళహస్తిలో 32,836, సూళ్లూరుపేటలో 27,946, రైల్వే కోడూరులో 26,047, సత్యవేడులో 23,345 కేసులు గుర్తించినట్లు తెలిపారు.

ఈ జాబితాలన్నీ బీఎల్వోల వద్ద ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, సవరణలు, కొత్తగా పేర్ల నమోదు, తొలగింపుల కోసం అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ నెల మొత్తం అందిన దరఖాస్తులు, అభ్యంతరాలపై విచారణలు నిర్వహించి స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేస్తామని, అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోండి

జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. చిరునామా మార్పు, పేరు, వయస్సు, ఇతర వివరాల సవరణలు లేదా కుటుంబ సభ్యులను ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలోకి మార్చుకోవడానికి ఫారం–8 వినియోగించుకోవాలని కోరారు. ఈఆర్‌వో నిర్ణయంతో సంతృప్తి లేకపోతే జిల్లా ఎన్నికల అధికారికి, అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. మీడియా, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు, ప్రజల సహకారంతో పూర్తిస్థాయి ఖచ్చితత్వం కలిగిన, పారదర్శకమైన, లోపరహిత ఓటరు జాబితాను సిద్ధం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

జిల్లాలో మొత్తం 2,221 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసామని, ముసాయిదా ఓటరు జాబితాలు సంబంధిత ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, అన్ని పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల శాఖ వెబ్‌సైట్‌లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉన్నాయని, ఓటర్లందరూ తమ వివరాలను పరిశీలించి అవసరమైతే నిర్దేశిత గడువులోగా అభ్యంతరాలు, సవరణలు, కొత్త నమోదు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లా ముసాయిదా ఓటర్ల వివరాలు

  • జిల్లాలో మొత్తం ఓటర్ల వివరాల సంఖ్య 14,81,603
  • పురుషులు 7,20,329 మంది
  • మహిళలు 7,61,188 మంది
  • థర్డ్ జెండర్లు 86 మంది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు
సూళ్లూరుపేట 1,04,870 1,10,454 14 2,15,338
వెంకటగిరి 1,02,878 1,06,394 04 2,09,276
రైల్వే కోడూరు 88,756 91,252 09 1,80,017
చంద్రగిరి 1,27,030 1,36,465 27 2,63,522
తిరుపతి 98,916 1,05,476 14 2,04,406
శ్రీకాళహస్తి 1,04,158 1,12,121 08 2,16,287
సత్యవేడు 93,721 99,026 10 1,92,757