Solar Power | అదనపు ఆదాయం దిశగా అడుగులు

Solar Power | అదనపు ఆదాయం దిశగా అడుగులు

మహిళల చేతుల్లో సోలార్ శక్తి

Solar Power | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభించింది. మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా, యజమానులుగా మారి ఆదాయం పొందేలా ఈ ప్రాజెక్టును అమలు చేయడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారంతో మహిళలు విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ విజయవంతంగా రాణించగలరని ఈ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైందని వారు పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా మహిళా సంఘాలకు ప్రతి ఏడాది సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీంతో మహిళల ఆర్థిక స్వావలంబన మరింత బలోపేతం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 2 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వెంకటాపురం సోలార్ ప్రాజెక్టు విజయవంతం కావడం ఈ కార్యక్రమానికి మరింత ఊతమిచ్చిందని అధికారులు తెలిపారు.

అదేవిధంగా, రైతులు మరియు గృహ వినియోగదారులు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. పంటలతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఆదాయ వనరులను పెంచుకునేలా ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం, ఆర్థిక సాధికారత లక్ష్యాలతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలు, రైతులు, గృహ వినియోగదారులు భాగస్వాములు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.