Eluru Suspicious Death | హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు
Eluru Suspicious Death | హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు
Eluru Suspicious Death | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఏలూరు జిల్లాలో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దూబచర్ల-చేబ్రోలు ప్రధాన మార్గంలో ఉన్న జీడిమామిడి తోటలో ఇద్దరు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీకూతుళ్లుగా గుర్తించారు.
మృతుల్లో ఒకరి తలకు తీవ్ర గాయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా లేదా మరేదైనా కారణమా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
