Bilateral Trade | భారత్-యుకే ‘‘స్వేచ్ఛా వాణిజ్య’’ ఒప్పందానికి ఆమోదం !!

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో భారతదేశం (India) – యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)ను కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) మంగళవారం ఆమోదించింది. ఈ కీలక ఒప్పందంపై జూలై 24న లండన్‌లో అధికారికంగా సంతకాలు జరగనున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) బుధవారం ప్రారంభం కానున్న‌ నాలుగు రోజుల యూకే & మాల్దీవుల పర్యటన(UK & Maldives Tour)లో భాగంగా ఈ ఒప్పందాన్ని (Agreement) ఖరారు చేయనున్నారు. ప్రధాన మంత్రి వెంట వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కూడా లండన్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈ సంవత్సరం మే 6న విజయవంతంగా ముగిశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

సుంకాల తగ్గింపు…

ఈ ఒప్పందం ప్రకారం, భారత్ నుండి లెద‌ర్, షూస్, దుస్తులు వంటి శ్రమ ఆధారిత ఉత్పత్తులపై UK పన్నులు తొలగించనుంది. అదే సమయంలో బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను భారత్‌లో చౌకగా చేసేందుకు సుంకాలను తగ్గించనుంది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని 2030 నాటికి 120 బిలియన్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతదేశ ఎగుమతుల్లో దాదాపు 99% సుంకం లేకుండా UK మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయి. అదేవిధంగా, భారతదేశం బ్రిటిష్ ఉత్పత్తులపై సుంకాలను 90% వరకు తగ్గిస్తుంది. వీటిలో, 85% రాబోయే పదేళ్లలో పూర్తిగా సుంకం లేకుండా ఉంటాయి.

ఈ ఒప్పందం భారతదేశానికి వస్త్రాలు, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, క్రీడా వస్తువులు, బొమ్మలు, నగలు, ఆటో విడిభాగాలు, సేంద్రీయ రసాయనాలు వంటి రంగాలలో ప్రయోజనం చేకూరనుంది. అటు UK కి విస్కీ, ఆటోమొబైల్స్, పారిశ్రామిక యంత్రాలు, ఔషధాల వంటి రంగాలలో ప్రయోజనం చేకూరుస్తుంది.

లండన్‌లో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, దానిని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది, అలాగే భారత క్యాబినెట్ తుది ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రక్రియకు దాదాపు ఒక సంవత్సరం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply