A‍‍‍‍‍‍‍‍‍‍PL | విజయవాడ సన్‌షైనర్స్ అద్భుత విజయం

A‍‍‍‍‍‍‍‍‍‍PL | విజయవాడ సన్‌షైనర్స్ అద్భుత విజయం

  • కాకినాడ కింగ్స్‌పై 52 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ
  • బ్యాటింగ్‌లో అభినవ్ మెరుపులు.. బౌలింగ్‌లో భరత్ విజృంభణ
  • సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్న విజయవాడ

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఏపీఎల్-2026 సీజన్-5లో విజయవాడ సన్‌షైనర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన నాలుగో రోజు తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్‌పై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఎం. అభినవ్, బౌలింగ్‌లో భరత్ రాణించడంతో విజయవాడ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది.

మొదట టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన విజయవాడకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అశ్విన్ త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఎం. అభినవ్ దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఉపయోగకరమైన పరుగులు జోడించగా, చివర్లో జహీర్ అబ్బాస్ 11 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టుకు వేగం అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో విజయవాడ సన్‌షైనర్స్ 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. కాకినాడ బౌలర్లలో గిరి ప్రసాద్ మూడు వికెట్లు, ఆశిష్ రెండు వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదనలో తడబడిన కాకినాడ

203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. విజయవాడ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. 10 ఓవర్లకే 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే లేకాజ్ రెడ్డి ఒంటరి పోరాటం చేశాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. తపస్వి 25 బంతుల్లో 31 పరుగులతో కొంతసేపు అండగా నిలిచినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా కాకినాడ జట్టు 150 పరుగులకే ఆలౌటైంది.

విజయవాడ బౌలర్లలో భరత్ 3 వికెట్లతో చెలరేగగా, సిద్ధార్థ్, మోహన్, సుమిత్ తలో రెండు వికెట్లు పడగొట్టి కాకినాడ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎం. అభినవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Leave a Reply