Gold Prices India | తెలంగాణ-ఏపీలో పెరిగిన బంగారం కొనుగోళ్లు
Gold Prices India | తెలంగాణ-ఏపీలో పెరిగిన బంగారం కొనుగోళ్లు
Gold Prices India | రికార్డు ధరల మధ్య పెట్టుబడిదారుల దృష్టి గోల్డ్‌పైనే
మోడీ పిలుపుపై జువెల్లర్స్ ఆందోళన
మధ్యతరగతిపై పెరుగుతున్న బంగారం భారం
బంగారం మార్కెట్‌పై ప్రభావం లేదంటున్న వ్యాపారులు
Gold Prices India | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రికార్డు స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బంగారం కొనుగోళ్లలో గణనీయమైన వృద్ధి కొనసాగుతోంది. గత నెలతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు సుమారు 10 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడి కోసం గోల్డ్ కాయిన్లు, బార్లు, బులియన్ కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు స్పష్టం చేస్తున్నాయి. అధిక ధరల ప్రభావంతో ఆభరణాల కొనుగోళ్లలో కొంత జాగ్రత్త ధోరణి కనిపిస్తున్నప్పటికీ, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అక్షయ తృతీయ, వివాహ సీజన్, పండుగల సమయంలో డిమాండ్ మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
సుమారు 105 నుంచి 125 టన్నుల వరకు బంగారం వినియోగం జరుగుతుందని అంచనా. రోజుకు సగటున 300 నుంచి 350 కిలోల వరకు, నెలకు 8 నుంచి 10 టన్నుల వరకు వినియోగం నమోదవుతోందని బులియన్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇటీవల అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు వంటి కారణాలతో గోల్డ్ ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విలాసవంతమైన ఆభరణాల కొనుగోళ్లు సుమారు 30 శాతం వరకు తగ్గినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తూ ప్రజలు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, వ్యాపార కుటుంబాలు, ఎన్ఆర్ఐ కుటుంబాలు, పెళ్లి ఆభరణాల కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లలో ముందంజలో ఉన్నారు. మరోవైపు ధరల పెరుగుదలతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సుమారు 30 నుంచి 40 శాతం మంది వినియోగదారులకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం భారంగా మారిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. దీంతో తక్కువ బరువు గల ఆభరణాలు, ఎక్స్చేంజ్ పథకాలు, ఈఎంఐ విధానాలు, తక్కువ గ్రాముల కొనుగోళ్ల వైపు మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం దాటకుండా ఉండేందుకు ప్రధాని Narendra Modi మే 10న కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అయితే మోదీ ప్రకటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మందికిపైగా ఉపాధికి ముప్పు అని జువెల్లర్స్ ఫెడరేషన్ అభిప్రాయ పడింది. ఇందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా మన విదేశీ మారక ద్రవ్యం తరిగిపోకుండా ఉండేందుకు.. చమురు వినియోగాన్ని తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మారాలని, వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ మానుకోవాలని పిలుపునిచ్చారు. అయితే, ఇందులో అన్నింటికంటే ఎక్కువగా బంగారం కొనుగోళ్లు నిలిపివేయడం ఎందుకు? అన్న ప్రశ్న మెజారిటీ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది.
ఇప్పటికే ఒకవైపు మోదీ పిలుపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. గోల్డ్ జువెల్లరీ కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుందన్న కారణంతో.. ఒకవైపు గోల్డ్ మార్కెట్ కూడా క్రాష్ అవుతోంది. కళ్యాణ్ జ్యూయలర్స్, పీసీ జ్యూయలర్స్, సెంకో గోల్డ్ వంటి పలు జువెల్లరీ స్టాక్స్ భారీగా పతనం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు వర్గాలు దీనిని స్వాగతిస్తుండగా.. మరికొందరు దీనిని తప్పుబడుతున్నారు. తాజాగా ఆల్ ఇండియా జువెల్లర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ కూడా దీనిపై స్పందించింది. పసిడి కొనుగోళ్లను ఏడాది నిలిపివేయడం.. విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం కాదని.. మోదీ సూచన దాదాపు 3.5 కోట్ల మంది (35 మిలియన్లు) ఉపాధికి ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించడం సహా దానిని పునర్వినియోగంలోకి తీసుకురావడం మంచి ఆప్షన్ అని తెలిపింది.
బంగారం కొనుగోళ్లు వాయిదా వేయడం కాకుండా.. పసిడి సమీకరణ వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను జువెల్లర్స్ ఫెడరేషన్ నొక్కిచెప్పింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి Piyush Goyalకు ఏఐజేజీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా లేఖ రాశారు. పసిడి గిరాకీని తగ్గించడం వల్ల పరిష్కారం ఉండదు. మోదీ ప్రకటనతో ఆభరణాల తయారీ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపుతో వినియోగదారుల ఆలోచన ధోరణిలో అకస్మాత్తుగా వచ్చే ప్రతికూల మార్పుల వల్ల.. జువెల్లరీలకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గడమే కాకుండా.. తయారీ ఆర్డర్లు కూడా మందగిస్తాయని.. మొత్తంగా జువెల్లరీ మార్కెటే దెబ్బతింటుందని హెచ్చరించారు.
సరఫరా వ్యవస్థ అత్యంత కీలకంగా ఉన్న చిన్న తరహా ఆభరణాల వ్యాపారులు, చేతివృత్తుల వారి ఆదాయంపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. ఇది పసిడి వ్యాపారానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని.. జీవనపాధి సమస్య అని లేఖలో స్పష్టం చేశారు.
వ్యాపారాలపై ఏమాత్రం ప్రభావం లేదు: మాణేపల్లి మురళి
ప్రధాని మోడీ పిలుపు ప్రభావం బంగారం, వెండి, వజ్రాల వ్యాపార లావాదేవీలపై ఏమాత్రం లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జువెల్లరీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, హైదరాబాద్, సికింద్రాబాద్ బులియన్ అసోసియేషన్ కోశాధికారి మాణేపల్లి మురళి తెలిపారు. జనాభాలో అల్పాదాయ వర్గాలు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 60 నుంచి 70 శాతం మంది తమతమ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. ధరలు పెరగినా, తగ్గినా.. ధనిక వర్గాలపై ప్రభావం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. రికార్డు ధరల మధ్య బంగారం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గడం లేదని, తెలంగాణ-ఏపీలో పెట్టుబడిదారుల దృష్టి అంతా గోల్డ్‌పైనే ఉందని చెప్పారు.
