మంత్రి సహకారంతో ఊట్కూర్‌కు క్రీడా మైదానం..

  • రూ.2.50 కోట్లతో పనులకు శ్రీకారం
  • భూ సర్వే పూర్తి, త్వరలో నిర్మాణం ప్రారంభం.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న క్రీడా మైదానం కల త్వరలో సాకారం రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రీడా మైదానం కోసం మంగళవారం భూ సర్వే పనులు చేపట్టారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించి, వేగంగా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతన్‌పల్లి సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.మంత్రి ప్రత్యేక చొరవతో ఊట్కూర్ మండల కేంద్ర శివారులో ప్రతిపాదించిన స్థలంలో అధికారులు మంగళవారంభూ సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఊట్కూర్ మండలం నుంచి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన అనేక మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ సరైన క్రీడా మైదానం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారని అన్నారు.నిర్మించనున్న క్రీడా మైదానంలో అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో తదితర క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

మైదానం అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత యువత తమ ప్రతిభను మరింత మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు.క్రీడలను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రీడా మైదానం పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి వై ఎస్ ఓ శెట్టి వెంకటేష్, ఆర్ఐ కృష్ణారెడ్డి, రాష్ట్ర సర్వే బృందం అధికారులు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొక్కు లింగం, నాయకులు జలాల్ ,చందు లక్ష్మణ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.