సింగూరు ముంపు ప్రాంతంలో కబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

సింగూరు ముంపు ప్రాంతంలో కబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
సింగూరు ముంపు ప్రాంతంలో అక్రమ కబ్జాలు, సహజ జలవనరుల విధ్వంసంపై చర్యలు తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి, సింగూరు ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కదిరాబాద్, సాయిపేట గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సహజ జలవనరుల విధ్వంసం, ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

కనుమరుగైన కొరివి కుంట

కదిరాబాద్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 420, 422, 444/2లో ఉన్న కొరివి కుంట, నల్ల కుంట అనే సహజసిద్ధమైన చెరువులను భారీ యంత్రాలతో ధ్వంసం చేశారని క్రాంతికిరణ్ ఆరోపించారు. సింగూరు ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నీటిని ఖాళీ చేసిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని, మంత్రి దామోదర రాజనర్సింహ బంధువుగా పేర్కొంటున్న అనిల్‌రెడ్డి, అతని అనుచరులు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములను చదును చేసి, అక్కడ లగ్జరీ రిసార్టులు, బోటింగ్ వంటి వాణిజ్య కార్యకలాపాలకు అనువుగా అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చిన్న, సన్నకారు రైతుల భూములను కూడా ఆక్రమిస్తున్నారని తెలిపారు.

కబ్జాలను చట్టబద్ధం చేసుకునేందుకే ప్రయత్నాలు

అక్రమ ఆక్రమణలను చట్టబద్ధం చేసుకునే ఉద్దేశంతో, అక్కడ పాత దేవాలయం ఉన్నట్లు చూపించేలా మతపరమైన జెండాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పరిధిలోకి కిలోమీటరు మేర విద్యుత్ లైన్లు లాగి, విద్యుత్ దొంగతనానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక రైతులు తమ పొలాలకు మట్టిని తరలించకుండా అడ్డుకుంటూ, భారీ యంత్రాలతో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సహజ చెరువుల విధ్వంసం, సింగూరు ప్రాజెక్ట్ ఎఫ్‌టీఎల్ సరిహద్దుల ధ్వంసంతో పర్యావరణానికి, ప్రాజెక్టు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎఫ్‌టీఎల్ హద్దులను గుర్తించాలి

ఈ వ్యవహారంపై రెవెన్యూ, సాగునీటి శాఖల ద్వారా వెంటనే ఉమ్మడి సర్వే నిర్వహించి, ఎఫ్‌టీఎల్ సరిహద్దులను గుర్తించాలని క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ధ్వంసమైన కొరివి కుంట, నల్ల కుంటల గట్లు, తూములను పూర్వస్థితికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు.
సింగూరు ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, ప్రభుత్వ భూములు, సహజ జలవనరులను పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply