Odisha | ఒకరు మృతి.. 100మందికి పైగా గాయాలు
Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా బడా దండా (గ్రాండ్ రోడ్) వద్ద తీవ్ర తోపులాట నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 100 మందికిపైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు.
రథయాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఒకేసారి బడా దండా వీధికి చేరుకోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో కొందరికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. పరిస్థితిని గమనించిన ప్రత్యేక రెస్క్యూ యూనిట్ (ఎస్ఆర్యూ) బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. అస్వస్థతకు గురైన భక్తులను జనసందోహం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వారిలో కనీసం 33 మంది భక్తులను మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
రథయాత్ర జరుగుతున్న సమయంలో కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. దీంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఎక్కడా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగకుండా పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, స్వచ్ఛంద సేవకులు కలిసి జనసందోహాన్ని నియంత్రించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని, రథయాత్ర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
