పల్లికొండలో పూర్తి స్థాయిలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పల్లికొండ గ్రామపంచాయతీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ పిండి మనూష అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీకి వచ్చిన ఎస్‌ఐఆర్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించి వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదు చేస్తున్నామని, ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్యూమరేషన్ సిబ్బంది ప్రజల వివరాలను పరిశీలించి నమోదు చేస్తున్నారని, ప్రజలు అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, బీఎల్‌వో, బీఎల్‌ఏ, ఓకేపీ వీఓఏ, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
