గోల్కొండ బోనాలతో ఆషాఢ సంబరాలకు శ్రీకారం..
అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నేత ఈటల రాజేందర్ గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని అన్నారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి బోనాన్ని కుమ్మర సమాజానికి చెందిన మహిళలు గోల్కొండ జగదంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
గోల్కొండలో తొలి బోనం సమర్పించిన అనంతరం లష్కర్ బోనాలతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీ, ప్రతి ఇంట్లో బోనాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతుందని, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ బోనాల వేడుకలు వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ప్రజలందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తూ.. “అమ్మా.. పిల్లలను, పెద్దలను, మమ్మల్ని చల్లగా చూడు.. సుఖసంతోషాలతో జీవించే భాగ్యం కలిగించు” అని ప్రార్థిస్తారని ఈటల అన్నారు. భూతల్లి కరుణతో వ్యవసాయం, వ్యాపారాలు సుభిక్షంగా సాగాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని భక్తులు మొక్కులు చెల్లిస్తారని చెప్పారు.
గోల్కొండ బోనాల జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా అందించే మహత్తర ఉత్సవమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కుమ్మర సోదరులు, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఈ పండుగను ఘనంగా నిర్వహించడం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని అన్నారు.
ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖశాంతులు, సస్యశ్యామలతతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
