కుమారుడు అదృశ్యంపై తల్లి ఫిర్యాదు..

పాయకాపురం, ఆంధ్రప్రభ: కుమారుడు అదృశ్యమైన ఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్డుకు చెందిన చల్ల దేవి ఇద్దరు కుమారులతో నివసిస్తోంది. ఆమె భర్త మృతి చెందగా, ప్రస్తుతం ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది.

ఆమె రెండో కుమారుడు అయ్యప్ప (23) కూడా బీసెంట్ రోడ్డులోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అయ్యప్ప కొంత అమాయక స్వభావం కలిగి ఉంటాడని, గతంలో రెండుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి మూడు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినట్లు తల్లి పోలీసులకు తెలిపింది.

ఈ నెల 8న పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అయ్యప్ప తిరిగి ఇంటికి రాలేదని పేర్కొంది. బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, యువకుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.