ఈవీఎం గోదాం త్రైమాసిక తనిఖీలు
ఈవీఎం గోదాం త్రైమాసిక తనిఖీలు
- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, ఆంధ్రప్రభ:
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను త్రైమాసిక తనిఖీ చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదాం సీల్‌ను పరిశీలించిన కలెక్టర్, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
అలాగే గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను కూడా ఆయన పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రతి నెల గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలను 24 గంటలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.డి. సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
