500 people | రెండు పడవలు మునక.. 500 మంది మృతి?

500 people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మయన్మార్‌కు చెందిన రోహింగ్యా మైనార్టీలు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనల్లో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఉన్నత కమిషనర్ కార్యాలయం (యూఎన్‌హెచ్‌సీఆర్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం… జూన్ చివరిలో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్ర తీరం నుంచి బయల్దేరిన ఓ పడవలో సుమారు 250 మంది ప్రయాణిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఆ పడవతో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. మరో పడవలో 280 మంది ప్రయాణికులు ఉండగా, అది అయేయార్వాడీ తీర ప్రాంతంలో మునిగిపోయినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలపై అందిన ప్రాథమిక వివరాలను పరిశీలించిన అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రాథమిక దర్యాప్తు నివేదికల ఆధారంగా రెండు పడవల్లో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది మృతి చెందినట్లు భావిస్తున్నామని ఐఓఎం, యూఎన్‌హెచ్‌సీఆర్ పేర్కొన్నాయి. అయితే అధికారికంగా మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశాయి. మెరుగైన జీవితం కోసం సముద్ర మార్గంలో ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నంలో రోహింగ్యా శరణార్థులు తరచూ ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.