Massive earthquake | రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత
Massive earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపంలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రముఖ పర్యాటక కేంద్రం టె అనావ్ పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భవనాలు కొన్ని సెకన్ల పాటు బలంగా ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం అనంతరం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర నిర్వహణ సంస్థ సూచించింది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
