విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలి: బీసీ సమాజ్
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరేడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆలయ పాలకమండలిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఇతర సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవిని పలుమార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించడం వల్ల ఇతర సామాజిక వర్గాల భక్తులు నష్టపోతున్నారని, ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక జనాభా బీసీలదేనని, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన భక్తులకు కూడా ఆలయ పాలకమండలిలో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 38, 46 స్ఫూర్తికి అనుగుణంగా సమాన అవకాశాలు, పారదర్శకత, సామాజిక న్యాయం పాటిస్తూ పాలకమండలి నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు జరిగిన నియామకాలపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి, ఎండోమెంట్స్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా నాయకులు సూరయ్య, విజయ్, కుమార్, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
