Singareni | బొగ్గు గనుల కేంద్రం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన బెల్లంపల్లి

Singareni | బొగ్గు గనుల కేంద్రం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన బెల్లంపల్లి

  • 38ఏళ్ల మున్సిపల్ ప్రస్థానంలో అద్భుత మలుపులు..
  • నేడు ఉత్తర తెలంగాణ వాణిజ్య హబ్
  • మహిళా జనరల్ రిజర్వేషన్‌తో మొదలైన ముందస్తు యుద్ధం..
  • మున్సిపల్ పీఠంపై ముగ్గుల సందడి

Singareni | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఒకప్పుడు నల్లబంగారు గనుల సైరన్ మోతలతో నిద్రలేచి, బొగ్గు దుమ్ముతో నిండిన వీధుల్లో కార్మికుల కదలికలతో కళకళలాడిన ప్రాంతం ఇది. సింగరేణి శ్రామికుల చెమట చుక్కలతో తడిసిన ఆ నేల నేడు ఆధునిక హంగులతో మెరుస్తోంది. అదే బెల్లంపల్లి. కాలప్రవాహంలో గనులు మూతపడినా, కార్మికులు వలస వెళ్లినా.. వెనుకడుగు వేయకుండా పారిశ్రామిక, వాణిజ్య, పాలనా కేంద్రంగా రూపాంతరం చెందుతూ ఉత్తర తెలంగాణ రాజకీయ పటంలో తనదైన ముద్ర వేస్తోంది. 38ఏళ్ల మున్సిపల్ చరిత్రలో ఎనిమిది మంది చైర్మన్ల పాలనను చవిచూసిన ఈ పట్టణం, నేడు మహిళా జనరల్ రిజర్వేషన్‌తో సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపింది.

Singareni | అనతి కాలంలోనే అసమాన వృద్ధి….

తొలినాళ్లలో బెల్లంపల్లి కేవలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక చిన్న నివాస ప్రాంతం మాత్రమే. అయితే సింగరేణి బొగ్గు గనుల విస్తరణతో ఈ ప్రాంతం శరవేగంగా పట్టణీకరణ వైపు అడుగులు వేసింది. వేలాదిగా తరలివచ్చిన కార్మికుల వల్ల బస్తీలు, కాలనీలు వెలిశాయి. కార్మిక, రైతు సంస్కృతులు మేళవించిన అరుదైన పట్టణంగా ఇది గుర్తింపు పొందింది. 1987వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బెల్లంపల్లిని మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రకటించడంతో ఇక్కడ అభివృద్ధి పర్వం మొదలైంది. ప్రారంభంలో 28వార్డులతో ఉన్న ఈ పురపాలిక, నేడు జనాభా పెరుగుదలకు అనుగుణంగా విస్తరిస్తూ రెండవ శ్రేణి మున్సిపాలిటీగా కొనసాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 56 వేలుగా ఉన్న జనాభా, నేడు అనూహ్యంగా 80 వేలకు చేరుకోవడం ఇక్కడి వృద్ధికి నిదర్శనం.

Singareni | గనులు మూతపడినా ఆగని ప్రగతి రథం..

సింగరేణి గనులు మూతపడటం వల్ల పట్టణం కుదేలవుతుందని అందరూ భావించారు. కానీ బెల్లంపల్లి మరో రూపంలో తన ఉనికిని చాటుకుంది. కేవలం గనులపైనే ఆధారపడకుండా విద్యా సంస్థలకు నిలయంగా, 12 మండలాలకు వ్యాపార కేంద్రంగా, చివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కూడా వేదికగా మారింది. ఒకప్పుడు 16వేలుగా ఉన్న నివాస గృహాల సంఖ్య, నేడు 20వేలకు పెరగడం విశేషం. ముఖ్యంగా కన్నాల, కాల్టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పట్టణ రూపురేఖలనే మార్చేసింది. సెంట్రల్ లైటింగ్ కాంతులు, హైమాస్ట్ దీపాలతో చౌరస్తాలు నేడు రాత్రివేళల్లో వెలుగులీనుతున్నాయి. మామిడి మార్కెట్ యార్డు, అత్యాధునిక వెజిటబుల్ మార్కెట్ కాంప్లెక్స్, 100 పడకల ఏరియా ఆసుపత్రి వంటి సౌకర్యాలు బెల్లంపల్లిని ఒక మోడల్ టౌన్‌గా నిలబెట్టాయి.

Singareni | రాజకీయ చదరంగంలో మహిళా జనరల్ జోరు…

బెల్లంపల్లి మున్సిపల్ చరిత్రలో ఇప్పటివరకు పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా సాగింది. 1987లో తొలి చైర్మన్‌గా ఇరుగురాల చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, మొన్నటి జక్కుల శ్వేత వరకు ఎనిమిది మంది పీఠాన్ని అధిష్టించారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి ‘మహిళా జనరల్’ కు రిజర్వ్ కావడం స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, జనసేన వంటి ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగింది. సీనియర్ నాయకులు తమ ఇంట్లోని మహిళలను బరిలోకి దించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. పట్టణంలోని 34 వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రచార పర్వాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

Singareni | 38 ఏళ్ల మున్సిపల్ పాలన… ఎనిమిది మంది చైర్మన్లు

బెల్లంపల్లి మున్సిపాలిటీ చరిత్రలో ఇప్పటివరకు ఎనిమిది మంది చైర్మన్లు పట్టణ పాలనకు నాయకత్వం వహించారు. 1987లో టీడీపీకి చెందిన ఇరుగురాల చంద్రశేఖర్ తొలి చైర్మన్‌గా ఎన్నికై 1992 వరకు పనిచేశారు. 1992లో అమురాజుల రాజేశ్వర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సింగరేణిలో సంక్షేమ అధికారిగా ఉద్యోగం రావడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన జంగం కేశవులు చైర్మన్‌గా ఎన్నికై 2001 వరకు సేవలందించారు.

2001 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్తమారి సరస్వతి చైర్‌పర్సన్‌గా ఎన్నికై 2005 వరకు పనిచేశారు. 2005లో మత్తమారి సూర్యనారాయణ (సూరిబాబు) చైర్మన్‌గా ఎన్నికై 2010 వరకు కొనసాగారు. అనంతరం ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారులు పాలన చేపట్టారు. 2014 ఎన్నికల్లో పసుల సునితారాణి మహేష్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అవిశ్వాస తీర్మానం కారణంగా ఆమె పదవి కోల్పోయారు. ఆ తరువాత మునిమంద స్వరూప రమేష్ టీఆర్ఎస్ నుంచి చైర్మన్‌గా ఎన్నికై కొద్ది కాలం పనిచేశారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జక్కుల శ్వేత చైర్‌పర్సన్‌గా ఎన్నికై 2025 జనవరి వరకు పదవిలో కొనసాగారు. ఆ తరువాత మున్సిపల్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొనసాగుతున్న విషయం విధితమే.

Singareni | మౌలిక సదుపాయాలే ప్రధాన అజెండా…

రానున్న ఎన్నికల్లో ప్రధానంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాలే అజెండాగా మారనున్నాయి. మందమర్రి-బెల్లంపల్లి ఉమ్మడి గోదావరి తాగునీటి పథకం ద్వారా నీటి సమస్య చాలా వరకు తీరినప్పటికీ, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రజలు మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. శాంతిఖని, పాత జనరల్ మేనేజర్ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ రోడ్డు వంటి కీలక ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల విస్తరణ అవసరం కనిపిస్తోంది. అలాగే బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా మార్చాలనే డిమాండ్ కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మందమర్రి మున్సిపాలిటీని, తాండూర్, కాసీపేట మండలాలను బెల్లంపల్లిలో విలీనం చేసి బెల్లంపల్లిని కార్పొరేషన్‌గా మార్చే అవకాశాలు మెండుగా ఉండటంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత శక్తివంతమైన కేంద్రంగా అవతరించనుంది.

Singareni | వారసత్వ పోరులో కొత్త ముఖాలు…

ప్రస్తుత రాజకీయ సమీకరణాలను గమనిస్తే, పాత తరం నాయకుల వారసులు లేదా వారి కుటుంబ సభ్యులే ఎక్కువగా తెరపైకి వస్తున్నారు. చైర్మన్ పదవి రిజర్వేషన్ ఖరారు కావడంతో మహిళా నేతల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా నాయకులు తమ తమ సామాజికవర్గాల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. పాలనా దక్షత గల మహిళా చైర్మన్ పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రస్తుతం ప్రత్యేక అధికారిగా పాలన సాగిస్తున్న తరుణంలో, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు బెల్లంపల్లి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మున్సిపల్ చైర్మన్ కుర్చీ ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ పట్టణ వాసుల్లో నెలకొంది.

CLICK HERE TO READ ఆత్మ గౌరవం కోసమే రాజకీయాల్లోకి : భట్టి

CLICK HERE TO READ MORE