Alluarjun | కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

Alluarjun | కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

Alluarjun | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్‌ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసుకు సంబంధించి మొత్తం 19 మంది నిందితులు కోర్టుకు హాజరుకావాలని ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అల్లు అర్జున్‌ మినహా మిగతా నిందితులంతా న్యాయమూర్తి ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం కేసు తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

సంధ్య థియేటర్‌ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. ఏ-1 నుంచి ఏ-10 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్య ప్రతినిధులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 23మంది నిందితులపై ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది.

గత ఏడాది డిసెంబర్‌ 4న ‘పుష్ప-2’ బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.