హైదరాబాద్ – భారత జాతిని ఏకతాటిపై నిలిపేందుకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని, ఆయన స్వప్నించిన సమ సమాజ నిర్మాణం కోసం అందరం కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సింగరేణి భవన్ లో సోమవారం జరిగిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు.

స్వతంత్ర భారతదేశ ప్రగతికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల వల్లే ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛా, సమానత్వం, సమాన అవకాశాలు లభించాయన్నారు. కార్మికులకు, మహిళలకు హక్కులను కల్పించిన ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తుల్లో అంబేద్కర్ అగ్రగణ్యుడు అని కొనియాడారు. అంబేద్కర్ చెప్పినట్లుగానే విద్య ద్వారానే అవకాశాలను దక్కించుకోగలుగుతామని, ప్రతీ ఒక్కరు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభానీ అధ్యక్షత వహించి ప్రసగించారు. ఎస్సీ, ఎస్టీ అసోషియేషన్ ప్రతినిధి బోడ భద్రు మాట్లాడారు. కార్యక్రమంలో సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.