పొరపాట్లకు తావులేకుండా ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి ముందు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 39 అజెండా అంశాలను చర్చించి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.

సమావేశం అనంతరం కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బీఎల్‌వోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లతో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని 36 వార్డుల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సమన్వయంతో పూర్తి చేయాలని, అవసరమైతే ప్రతి వార్డులో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజల దరఖాస్తులను సకాలంలో పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్‌పర్సన్ ముస్కాన్ నాజ్ నయ్యర్ అలీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బీఎల్‌వోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.