విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి..

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి..

అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో

తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు.ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని శనివారం డివిజన్ కేంద్రంలోని సమీకృత వసతి గృహంలో అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు.ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు.ప్రభుత్వం విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు వసతి గృహాలు, గురుకులాలు ఏర్పాటు చేసి ఆ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాలతో నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని, విద్యతో పాటు ఇతర నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని తెలిపారు.విద్యార్థులు ఎక్కువగా మొబైల్‌ ఫోన్‌లకు అలవాటు పడ్డారని, వాటిలో వీడియోగేమ్స్‌, కార్టూన్స్‌చూస్తూ శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారని, వీటి నుంచి దూరం చేయడానికి ఈ శిబిరాలు దోహదం చేస్తాయన్నారు.

వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన పౌషికాహారం కోసం డైట్ చార్జీలు, వ్యక్తిగత పరిశుభ్రత నిమిత్తం కాస్మోటిక్ చార్జీలు 40 శాతం మేర ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు.మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ….వసతి గృహాల విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరు కానున్నారని, మే 24 వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎల్ పీఓ ఆర్ పుల్లారావు,ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, వార్డెన్లు సదానందం, మధురిమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply