అధికారుల నిర్లక్ష్యం… ప్రజాప్రతినిధుల మౌనం
అధికారుల నిర్లక్ష్యం… ప్రజాప్రతినిధుల మౌనం
- విద్యార్థులు, కార్మికులు భయంతో ప్రయాణం
పాలకుర్తి, ఆంధ్రప్రభ: పాలకుర్తి నుండి బసంత్‌నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారి మీద వీధి దీపాలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ నాయకులు, అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రధాన రహదారి అయినప్పటికీ రాత్రి సమయంలో పూర్తిగా చీకటి కమ్ముకోవడంతో ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి సమయంలో వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు..
రాత్రి సమయంలో ట్యూషన్లు, కాలేజీలు, పనుల నుంచి తిరిగి వచ్చే విద్యార్థులు పూర్తిగా చీకటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీధి దీపాలు లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు భయంతో ప్రయాణిస్తున్నారు. కొందరు మొబైల్ లైట్లు, టార్చ్ల సహాయంతో వెళ్లాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. పరిస్థితి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరిగినా చర్యలు లేవు..
రోడ్డుపై లైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో వాహనాలు ఢీకొనే ఘటనలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా సమస్యను పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో రోడ్డుపైకి వస్తాం..
ఇప్పటికైనా పాలకుర్తి–బసంత్‌నగర్ ప్రధాన రహదారిపై ఉన్న వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేసి వెలిగించకపోతే గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి బైఠాయింపు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో చీకటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యను తేలికగా తీసుకోవడం సరికాదని, వెంటనే వీధి దీపాలను సరిచేసి వెలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు తెలిపారు.
