ఓటరు సర్వేలో పారదర్శకతకు బీఎల్ఓలకు మరోసారి అవగాహన కల్పించాలి

ఓటరు సర్వేలో పారదర్శకతకు బీఎల్ఓలకు మరోసారి అవగాహన కల్పించాలి

విలేకరుల సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు)కు మరోసారి సమగ్ర అవగాహన కల్పించాలని బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్ కోరారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమనిప్రతి అర్హుడైన పౌరుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సర్వే నిర్వహణలో బీఎల్ఓలు నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించాలని సూచించారు.అవగాహన లోపం కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోవడం లేదా తప్పులు నమోదయ్యే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులు రాకుండా అధికార యంత్రాంగం బీఎల్ఓలకు మరోసారి శిక్షణ, మార్గదర్శకాలు అందించాలని కోరారు.సర్వే ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలు కూడా తమ వివరాలను సక్రమంగా అందించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కుర్వ ఆశప్ప, కృష్ణయ్యగౌడ్, హన్మంతు, మండల ప్రధాన కార్యదర్శులు తారా కృష్ణ, రణవీర్, పి ఎల్ ఓ లు రవికుమార్, తిమ్మప్ప అశోక్ గౌడ్ బాలాంజనేయులు, భరత్, అనిల్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.