ఊట్కూర్ లో హోలీ ఆనంద కేళి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీలలో మంగళవారం హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా ఒకరిపై ఒకరు వివిధ రకాల రంగులు చల్లుకొని హోలీ వేడుకలు అత్యంత ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా చిన్నారులు యువకులు , మహిళలు ఆయా కాలనీలో డీజేలు ఏర్పాటు చేసుకుని రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. ప్రతి ఏడాది హోలీ వేడుకల్లో భాగంగా మొదటి రోజు సోమవారం కామ దహనం కార్యక్రమం ఘనంగా చేపట్టారు. యువకులు చిన్నారులు ఆయా గ్రామాల్లోని బొడ్రాయి ప్రధాన చౌరస్తాల వద్ద కామ దహన కార్యక్రమంచేపట్టారు.
హోలీ వేడుకల్లో భాగంగా పలువురు యువకులు ఇంటింటికి వెళ్లి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఇంటిల్లిపాది వివిధ రకాల రంగులు చల్లుకొని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆనందోత్సవాల మధ్య హోలీ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు.
