తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బిజెపే కీలకం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బిజెపే కీలకం
- బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్
నిర్మల్, ఆంధ్రప్రభ : తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్మల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
అనంతరం రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాడిన వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమయంలో కీర్తిశేషులు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తొలి ఓటు వేసి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
అలాగే తెలంగాణ ప్రజల గుండెల్లో ‘చిన్నమ్మ’గా చిరస్థాయిగా నిలిచిన స్వర్గీయ సుష్మా స్వరాజ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె అందించిన సహకారం చిరస్మరణీయమని అన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని విమర్శించారు. అమరవీరుల త్యాగాలకు నిజమైన న్యాయం జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని రితేష్ రాథోడ్ పేర్కొన్నారు.
