చిన్నారుల ఆరోగ్య రహస్యాలను ముందే గుర్తించే AI..

చిన్నారుల ఆరోగ్య రహస్యాలను ముందే గుర్తించే AI..

‘నవచేతన’ యాప్‌పై ప్రత్యేక దృష్టి!

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ‘నవచేతన’ AI యాప్‌పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 0–6 ఏళ్ల పిల్లల AI ఆధారిత స్క్రీనింగ్‌పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులను మరింత సమర్థవంతంగా అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్క్రీనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార లోపాలు, అభివృద్ధి మైలురాళ్లలో తేడాలు, ఇతర ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

క్షేత్రస్థాయిలో సీడీపీఓలు, సూపర్వైజర్లు తరచుగా అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే సామాజిక సమస్యలపై గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించే స్క్రీనింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక AI యాప్‌తో పాటు ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు ఈ యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులకు కూడా ఈ ప్రక్రియను సులభంగా అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.

అనంతరం ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ, ‘నవచేతన’ AI యాప్ ద్వారా మూడు విధానాల్లో పిల్లల స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని AI విశ్లేషిస్తుందని చెప్పారు.

మొదటగా యాప్ ద్వారా చిన్నారుల శారీరక, మానసిక స్థితిని పరిశీలించడం, రెండవదిగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను ప్రశ్నించి సమాచారాన్ని సేకరించడం, మూడవదిగా ప్రత్యేక కిట్ల వినియోగం ద్వారా పిల్లల సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుందని వివరించారు.

0–6 సంవత్సరాల పిల్లలను తొమ్మిది దశలుగా విభజించి, వయస్సు ఆధారంగా యాప్‌లో స్వయంచాలకంగా ప్రశ్నావళి రూపొందుతుందని తెలిపారు. ఈ విధానంతో పిల్లల్లో ఉండే 21 రకాల వైకల్యాలు, ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు రిఫరల్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ బి. రాజేష్ కుమార్, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.