SaiKrishna Missing Case | సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం…
SaiKrishna Missing Case | సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం…
SaiKrishna Missing Case |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విజయవాడలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో కలిసి సీఎం చంద్రబాబును కలిసి తమ ఆవేదనను వివరించారు. వారి గోడును ఓపికగా విన్న ముఖ్యమంత్రి, కేసులో న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కేసుపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోందని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, మే 9న ఒక కేసు విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను తీసుకెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ లభించలేదని తెలిపారు. ఇది కస్టడీలో జరిగిన మరణం అయి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సాయికృష్ణ అదృశ్యమయ్యాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగార్జును సస్పెండ్ చేసింది. అలాగే సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించి, నిష్పాక్షిక విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
