అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలను పరామర్శ…

అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలను పరామర్శ…
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని ఎ.కొండూరు తండా గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. గ్యాస్ బండ లీకేజీ కారణంగా భూక్యా గోపికి చెందినపూరిల్లు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు, ధాన్యం, దుస్తులతో సహా సర్వం కాలిపోవడంతో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతోనే నిరాశ్రయులుగా మిగిలారు.
సమాచారం అందుకున్న వెంటనే తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానం, నష్టపరిస్థితులను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన భూక్యా గోపి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గోపి పక్కా ఇల్లు నిర్మాణానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి అందే ఎక్స్ గ్రేషియా సహాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఎం.ఉదయభాస్కరరావుకు ఎమ్మెల్యే సూచించారు. బాధిత కుటుంబానికి తక్షణ ఉపశమనం కల్పించేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య,టీడీపీ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి, వనపర్ల డేవిడ్ రాజు,ఏలియా బాబు, సాదం నరసింహ తదితరులు పాల్గొన్నారు.
