వైభవంగా తిరునాళ్ల ప్రారంభం..

వైభవంగా తిరునాళ్ల ప్రారంభం..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా తెల్లవారుజామున ఆలయ కార్యనిర్వహణాధికారి మహేశ్వర రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ రమేష్ బాబు. జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తాగునీరు కొరకు మంచినీటి ట్యాంకర్లను ఆలయం చుట్టూ ప్రధాన వీధుల్లో అందుబాటులో ఉంచారు పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ దుమ్ము లేవకుండా ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటరింగ్ చేయించారు.
ముఖ్యంగా స్థానిక ఎస్ఐ అర్జున్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామ పురవీధుల్లో జనాలు రద్దీగా ఉన్న ప్రతి చోట సిబ్బందిని ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య అధికారి ఆలయం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి భక్తులకు అత్యవసరానికి ప్రధమ చికిత్స కు వినియోగించే మందులు అందుబాటులో ఉంచారు.
