నేర ప్రవృత్తి వీడి సత్ప్రవర్తనతో ముందుకు సాగాలి

నేర ప్రవృత్తి వీడి సత్ప్రవర్తనతో ముందుకు సాగాలి
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ:
రౌడీ షీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో తమ జీవితాలను మార్చుకోవాలని హసన్‌పర్తి సీఐ ఎ. మహేందర్ సూచించారు. సోమవారం హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మహేందర్ మాట్లాడుతూ, రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. నేర ప్రవృత్తిని వీడితే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.
భవిష్యత్తులో నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడితే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
పదేళ్ల పాటు ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే రౌడీ షీట్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత సహాయంతో రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని గుర్తుచేశారు.
ప్రవర్తనను సరిదిద్దుకుని, కుటుంబంతో కలిసి మంచి జీవితం గడపాలని సీఐ పిలుపునిచ్చారు. సమాజంలో మంచి గుర్తింపు పొందేలా మారాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న 18 మంది రౌడీ షీటర్లు భవిష్యత్తులో సత్ప్రవర్తనతో ఉంటామని హామీ ఇచ్చారు.
నేర ప్రవృత్తి వీడి సత్ప్రవర్తనతో ముందుకు సాగాలి
