నిలకడగా నాదెండ్ల బ్రహ్మం ఆరోగ్య పరిస్థితి..
- నాదెండ్ల దమ్ము ఆరోగ్య పరిస్థితిపైమణిపాల్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్..
- బేసిలర్ ఆర్టరీ బ్లాకేజీతో అక్యూట్ ఇస్కీమిక్ స్ట్రోక్‌గా వైద్యుల నిర్ధారణ..
- థ్రాంబోలైసిస్, మెకానికల్ థ్రాంబెక్టమీ విజయవంతం.. మెదడుకు రక్తప్రసరణ పునరుద్ధరణ…
- ఐసీయూలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స.. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందన్న వైద్యులు…
- నాడీ వ్యవస్థ కోలుకునే తీరుపై వచ్చే 24–48 గంటలు అత్యంత కీలకమని వెల్లడి…
విజయవాడ, ఆంధ్రప్రభ : కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ మణిపాల్ ఆస్పత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో న్యూరాలజీ, న్యూరో ఇంటర్వెన్షన్, క్రిటికల్ కేర్, అనస్థీషియా, రేడియాలజీ విభాగాల నిపుణుల బృందం నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించింది.
ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 15 రాత్రి సుమారు 11.30 గంటలకు నాదెండ్ల బ్రహ్మకు అకస్మాత్తుగా తీవ్రమైన నిద్రమత్తు, తలనొప్పి, శరీరం మొత్తం బలహీనత వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ మణిపాల్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించగా, ఆస్పత్రి స్ట్రోక్ రెస్పాన్స్ బృందం తక్షణమే చికిత్స ప్రారంభించింది.
అత్యవసర క్లినికల్ పరీక్షలు, సీటీ, ఎంఆర్ఐ స్కాన్ల అనంతరం బేసిలర్ ఆర్టరీ మూసుకుపోవడం వల్ల అక్యూట్ ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రికి చేరుకోవడంతో వెంటనే 18 మిల్లీగ్రాముల టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ ద్వారా ఇంట్రావీనస్ థ్రాంబోలైసిస్ నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
అయితే అనంతరం న్యూరోలాజికల్ పరిస్థితి క్షీణించడంతో శ్వాసనాళ రక్షణ కోసం వెంటిలేటర్ సహాయంతో ఎండోట్రాకియల్ ఇంట్యూబేషన్ చేపట్టారు. అనంతరం క్యాథ్‌ల్యాబ్‌లో న్యూరో ఇంటర్వెన్షన్ బృందం అత్యవసరంగా మెకానికల్ థ్రాంబెక్టమీ నిర్వహించి బేసిలర్ ఆర్టరీలోని రక్తగడ్డను విజయవంతంగా తొలగించి మెదడుకు రక్తప్రసరణను పునరుద్ధరించింది.
ప్రస్తుతం నాదెండ్ల బ్రహ్మం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, రక్తపోటు, గుండె స్పందనలు స్థిరంగా ఉన్నాయని, ఆరోగ్య పరిస్థితి హీమోడైనమికల్‌గా స్థిరంగా ఉందని ఆస్పత్రి వెల్లడించింది. అయితే నాడీ వ్యవస్థ ఎంత మేరకు కోలుకుంటుందనే విషయాన్ని అంచనా వేయడానికి రాబోయే 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరాన్ని బట్టి తదుపరి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని విజయవాడ మణిపాల్ ఆస్పత్రి పేర్కొంది.
