Incident | బస్సు రూపంలో వచ్చిన విషాదం…

Incident | బస్సు రూపంలో వచ్చిన విషాదం…

Incident | ఏలూరు క్రైమ్, ఆంధ్రప్రభ: కన్నబిడ్డకు ఒంట్లో బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి, తిరుగు ప్రయాణంలో బస్సు చక్రం కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏలూరు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలు అనంతలక్ష్మి (41).

ప్రమాద వివరాల ప్రకారం ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన గేదల అనంతలక్ష్మి బతుకుదెరువు కోసం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి వలస వెళ్లి వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు.

ఆమె కుమార్తె శృతి అనారోగ్యంతో బాధపడుతుండటంతో భీమడోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరూ తిరిగి గ్రామానికి వెళ్లేందుకు భీమడోలు బస్టాండ్‌కు చేరుకున్నారు.

అదే సమయంలో కొవ్వూరు డిపోకు చెందిన రాజమండ్రి వెళ్లే ఆర్టీసీ బస్సు బస్టాండ్‌లోకి వచ్చింది. బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు కదిపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దీంతో అనంతలక్ష్మి అదుపుతప్పి కిందపడిపోవడంతో బస్సు వెనుక చక్రం ఆమెపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ఈ ఘటనతో కూతురు శృతి అక్కడే రోదిస్తూ తల్లిని కోల్పోయిన ఆవేదన స్థానికులను కలచివేసింది.

మృతురాలికి భర్త, వివాహమైన కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. తల్లి మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ప్రమాదంపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో అధికారులు ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.